Saturday, August 24, 2013

Live bridge,Jenbatan Akar bridge,జీవమున్న వంతెన, జెంబతాన్‌ అకర్ వంతెన

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 Live bridge,Jenbatan Akar bridge,జీవమున్న వంతెన, జెంబతాన్‌ అకర్ వంతెన

 జీవమున్న వంతెన తెలుసా?వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం...దీన్ని చూడాలంటే ఇండోనేషియాకు వెళ్లాలి!

అదో వంతెన. ఏటికేడు పెరుగుతుంది. మరింత గట్టిపడుతుంది. ఎందుకంటే అది జీవమున్న వంతెన. అదే ఇండోనేసియాలో సమత్రా దీవిలో ఉన్న ఊడల వంతెన. ఈ ప్రకృతి వంతెన ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే 123 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
*ఈ వంతెన పేరు 'జెంబతాన్‌ అకర్‌'. నదికి ఇరువైపులా రెండు మర్రి చెట్ల ఊడలు ఇలా వంతెనలా అల్లుకుపోయాయి. అయితే వాటంతట అవే అల్లుకుపోలేదు. ఒక మంచి ఉపాధ్యాయుడి వల్లే ఈ ఊడల వంతెన ఏర్పడింది.
* 1890లో ఈ ప్రాంతంలో పకిహ్‌ సోహన్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెబుతుండేవారు.కొందరు విద్యార్థులు బాయాంగ్‌ నది దాటి అవతలి ఊరు నుంచి పాఠశాలకు వస్తుండేవారు. నది ప్రవాహం ఎక్కువున్నపుడు పిల్లలు పాఠశాలకు రాలేకపోయేవారు. దీంతో సోహన్‌కు ఒక ఉపాయం తట్టింది. నదికి ఇరువైపులా ఉన్న రెండు మర్రి చెట్ల ఊడలను కలిపేసి అల్లేశాడు. అలా ఆ ఊడలు ఏటికేడు పెరుగుతూ ఒకదానితో ఒకటి కలిసిపోయి గట్టిగా అల్లుకుపోయాయి. అలా 26 ఏళ్ల తర్వాత అందరూ నడవగలిగేలా ఈ ఊడల వంతెన తయారయ్యింది.
* ఈ ప్రకృతి వంతెన దాదాపు 82 అడుగుల పొడవుంది. ఇది 20 మంది బరువును కూడా తట్టుకోగలదు.
* వర్షాకాలంలో జారిపోకుండా ఈ ఊడల వంతెనకు గ్రామస్థులు స్టీలు తీగల వంటివి కట్టి మరింత గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుని సులువుగా రాకపోకలు సాగించేస్తున్నారు.
* నదిపై ఈ వంతెన సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నదిని స్థానికులు పూజిస్తారు. అందుకే వంతెన చుట్టూ ఉన్న ప్రాంతాన్నంతా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ చేపలు పట్టడాన్ని కూడా నిషేధించారు.
* ఇన్నేళ్లు గడిచినా ఈ సహజమైన వంతెన ఊడలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకే దీన్నంతా 'జీవించే వంతెన' అని పిలుస్తారు.
* ఈ అద్భుతాన్ని చూడ్డానికి రోజూ వందలాది పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల సందడి పెరగడంతో దీనికి కొద్ది దూరంలో మరో వేలాడే వంతెనను నిర్మించారు.

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: